Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కనీసం కిస్ కూడా పెట్టలేదు... అందుకే నచ్చేశాడు: తన ప్రేమకథను చెప్పిన ప్రియాంకా చోప్రా

  • శని, ఆదివారాల్లో ప్రియాంక, నిక్ ల వివాహం
  • వోగ్ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన జంట
  • స్నేహం, ప్రేమ గురించిన ఆసక్తికర విషయాలు చెప్పిన చోప్రా
మరో 24 గంటల్లో బాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరైన ప్రియాంకా చోప్రా, నిక్ జొనాస్ లు వివాహబంధంతో ఒకటి కానున్నారు. ఇప్పటికే సంగీత్, మెహందీ వేడుకలు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వోగ్ మ్యాగజైన్ కు తమ మధ్య స్నేహం, పెళ్లి వరకూ దారితీసిన ప్రేమపై పలు ఆసక్తికర విషయాలను ప్రియాంక పంచుకుంది.

తమకు చాలా కాలం నుంచి పరిచయం ఉందని చెప్పుకొచ్చిన ప్రియాంక, మెట్ గాలా వేడుకలో తనను చూసిన తరువాత ట్విట్టర్ లో డైరెక్టుగా మెసేజ్ ని పెడుతూ, 'నిన్ను కలవాలని అనుకుంటున్నా' అని నిక్ అన్నాడని గుర్తు చేసుకుంది. ట్విట్టర్ లో అయితే, సోషల్ మీడియాకు తెలిసిపోతుందన్న ఉద్దేశంతో తన పర్సనల్ నంబర్ ను ఇచ్చానని, ఆపై పలుమార్లు పార్టీల్లో కలుసుకున్నామని తెలిపింది.

ఒకసారి తాను న్యూయార్క్ పర్యటనలో ఉండగా, తన అపార్ట్ మెంట్ కు నిక్ ను పిలిచానని, ఆ సమయంలో తను ఎంతో మర్యాదగా నడుచుకున్నాడని చెప్పింది. కాసేపు మాట్లాడాక వెళ్లొస్తానని వెళుతూ కనీసం ముద్దు కూడా పెట్టలేదని, ఈ విషయంలో తనకు ఇప్పటికీ కోపంగానే ఉంటుందని, అదే నిక్ పై ఇష్టాన్ని పెంచిందని మురిపెంగా చెప్పింది. ముద్దు ఎందుకు పెట్టలేదన్న విషయాన్ని నిక్ వద్ద ప్రస్తావించగా, తన తల్లి కూడా అక్కడే ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశాడని అంది.

ఆపై ఓ మారు పుట్టిన రోజు సందర్భంగా నిక్ ను గ్రీస్ లోని క్రెటే దీవికి తీసుకెళ్లిన వేళ, మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశాడని, ఆపై కొన్ని సెకన్లు ఆలోచిస్తూనే ఉండిపోయానని, ఆపై సంతోషంతో అంగీకరించానని అంది. "నన్ను పెళ్లి చేసుకుని ఈ ప్రపంచంలోనే సంతోషకరమైన వ్యక్తిగా మారుస్తావా?" అని అతను ప్రపోజ్ చేసిన విధానానికి పడిపోయానని చెప్పుకొచ్చింది.

ఇక తమ వివాహానికి సమయమైందని గుర్తు చేసిన ప్రియాంక, శనివారం నాడు హిందూ సంప్రదాయంలో, ఆదివారం నాడు క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహం జరుగుతుందని చెప్పగా, అక్కడే ఉన్న నిక్, పెళ్లి తరువాత ప్రియాంకను ఓ రాకుమారిలా గుర్రంపై ఎక్కించుకుని తీసుకెళతానని సంబరంగా చెప్పాడు.
Priyaanka Chopra
Nick Zonas
Marriage
Love

More Telugu News